ఇంకా సైలెంట్ ఓటింగ్ అనడం భయానికి సంకేతం!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను చూస్తోంటే జాలి కలుగుతోంది. ఒకవైపు వారి సాక్షి ఛానల్ లో, సాక్షి దినపత్రికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నదని చెప్పిన రెండు మూడు సంస్థల ఎగ్జిట్ పోల్స్ నివేదికలను మాత్రమే చూపిస్తున్నారు. అదే సమయంలో పదికి పైగా సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ఎన్డీఏ కూటమి గెలవబోతున్నదని ఘంటాపథంగా చెబుతున్నప్పటికీ వారు ఇగ్నోర్ చేస్తున్నారు. అవన్నీ బూటకపు ఎగ్జిట్ పోల్స్ అని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఇది సహజం. ఏ పార్టీ అయినా సరే ఇలాగే ప్రవర్తిస్తుంది అనుకోవచ్చు. తమకు అనుకూలంగా వచ్చిన ఫలితాల్ని మాత్రమే ప్రమోట్ చేస్తుందని అనుకోవచ్చు.
కానీ, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ విషయంలో తమాషా ఏంటంటే.. తమ పార్టీ గెలవబోతున్నట్లుగా వస్తున్న నివేదికలను కూడా వారు సంపూర్ణంగా నమ్మడం లేదు. ఏదో మేకపోతు గాంభీర్యంతో ఆ సర్వేలు మాత్రమే నిజం అంటున్నారు గానీ.. వాస్తవంలో లోపల గుబులు అలాగే మిగిలి ఉంది. వైసిపి గెలవబోతున్నట్లుగా ఆ పార్టీ వారు పరిపూర్ణంగా నమ్మితే గనుక.. తెలుగుదేశం కూటమి గెలుస్తుందనే నివేదికలను తృణీకారంగా తోసిపుచ్చాలి. కానీ వారు ఆ పని చేయడం లేదు.
తెదేపా గెలుస్తుందనే ఎగ్జిట్ పోల్ నివేదికలనే పరిగణనలోకి తీసుకుంటూ అందుకు కౌంటర్ జవాబులు ఇవ్వడానికి ఉత్సాహపడుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ వచ్చిన నేపథ్యంలో పార్టీ తరఫున మీడియా ముందుకు వచ్చి తమ స్పందనను తెలియజేసిన సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు ఇందుకు నిదర్శనంగా ఉన్నాయి. రాష్ట్రంలో భారీ పోలింగ్ నమోదు అయిందని అదంతా కూడా తమ ప్రభుత్వానికి అనుకూలంగా పడిన సైలెంట్ ఓటింగ్ మాత్రమే అని సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికీ బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. పోలింగ్ జరిగిన నాటినుంచి ఆయన అదొక్కటే చెబుతూ.. తాము గెలవబోతున్నాం అని ప్రజలను నమ్మించాలనుకుంటున్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో సైలెంట్ ఓటింగ్ లో పాల్గొన్నప్పుడు.. వారి ఓటింగ్ సరళి ఎగ్జిట్ పోల్స్ లో బయటకు వచ్చే అవకాశమే లేదంటున్నారు.
ఒకవైపు తాము గెలుస్తామని చెబుతున్న నివేదికలు మాత్రమే కరెక్ట్ అని డప్పు కొట్టుకుంటూన్నారు. కనీసం ఆ వాదనను వారు పరిపూర్ణంగా నమ్మితే సైలెంట్ ఓటింగ్ ప్రస్తావనే తేకూడదు. ఇప్పటికీ సైలెంట్ ఓటింగ్ మాటెత్తుతున్నారంటే.. తెలుగుదేశం గెలుస్తుందనే నివేదికలు వారిని భయపెడుతున్నట్లుగా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. టీడీపీ గెలుస్తుందని ఎవరైనా అంటే మాత్రం.. ఎగ్జిట్ పోల్స్ లో సైలెంట్ ఓటింగ్ రిఫ్లెక్ట్ కాదు అనడం పలాయనవాదం కాక మరేమిటి?

Related Posts

Comments

spot_img

Recent Stories