‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నా.. నాకు జైకొట్టడానికి మీరంతా తరలిరండి. మీ భోజనాలు మీరే తెచ్చుకోండి.. వెయ్యి కార్లకు తగ్గకుండా నా వెంట ర్యాలీగా రండి’ అని ముద్రగడ పద్మనాభం కాపు కులం వారందరికీ పిలుపు ఇచ్చేసి ఉండవచ్చు గాక. కానీ ఆ పిలుపును అందుకునే వారెందరు? ఆయన కాపుల కోసం ఉద్యమిస్తున్నానంటే.. పార్టీ రహితంగా అందరూ వస్తారు గానీ.. తన పదవులకోసం ఒక పార్టీలో చేరుతోంటే.. అంతే బలం ఎందుకుంటుంది? అందుకే ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే వ్యవహారం ఇప్పుడు వాయిదా పడింది. ఆయన వైసీపీలో ఎప్పుడు చేరేది తర్వాత ప్రకటిస్తారని సమాచారం.
అయితే, ముద్రగడ వైసీపీలో చేరడం అనేది వాయిదా పడడానికి వారు చెబుతున్న కారణాలు చాలా కామెడీగా ఉన్నాయి. కిర్లంపూడినుంచి తాడేపల్లి దాకా వెయ్యి కార్లతో భారీ ర్యాలీగా వెళ్లి పార్టీలో చేరాలని ముద్రగడ నిర్ణయించారు. అయితే ఆయన పిలుపుకు అంత స్పందన రాలేదు. ఆయన అనుచరులు, వైసీపీ నాయకులు కాపు నేతలు పలువురికి ఫోన్లు చేసి ఆహ్వానించినా వారినుంచి పెద్దగా స్పందన లభించలేదు. వైసీపీ నాయకులే కార్లు ఏర్పాటుచేసి, ముద్రగడ చాలా ఘనంగా పార్టీలో చేరుతున్నట్టుగా బిల్డప్ ఇవ్వడం కోసం ఆ పార్టీ కూడా స్థానిక నాయకుల్ని పురమాయించింది. అయితే పార్టీ కోసం, ఎన్నికల కోసం ఖర్చులు పెట్టుకోవడానికి సిద్ధమే గానీ.. ముద్రగడ చేరిక కోసం ఖర్చులు పెట్టుకోవడానికి వారు అంత సుముఖంగా లేరు. దాంతో కార్లు సమకూరడం అనేది అసాధ్యం అని వారికి తేలిపోయింది. దాంతో ముందుగా ప్రకటించిన ప్రకారం.. ముద్రగడ కార్ ర్యాలీ ప్రారంభం కావడానికి సుమారు 20 గంటల ముందు వాయిదా వేస్తున్న సంగతిని ప్రకటించారు. ముద్రగడ ఎప్పుడు చేరేది తర్వాత ప్రకటిస్తామని అన్నారు.
అయితే విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారం ఏంటంటే.. అన్ని కార్లతో ర్యాలీ వస్తే ట్రాఫిక్ ఇబ్బందులు శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని పోలీసులు అభ్యంతర పెట్టినట్టుగా బిల్డప్ ఇవ్వబోతున్నారు. పరిమితంగా తక్కువ కార్లతో ర్యాలీ నిర్వహించేందుకు మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చినట్టుగా త్వరలోనే ఒక ప్రకటన వస్తుందని తెలుస్తోంది. ఆ తర్వాత పోలీసుల రిక్వెస్టు మేరకు తక్కువ కార్లతోనే ర్యాలీ చేపడుతున్నట్టుగా ముద్రగడ ప్రకటిస్తారు. అలాంటి బిల్డప్ తో పరువు కాపాడుకుంటూ వెళ్లి వైసీపీలో చేరబోతున్నారు.
అడుసు తొక్కనేల కాలు కడగనేల అన్నట్టుగా.. ఏదో తానొక కాపు కుల సూపర్ హీరో అన్నట్టుగా వెయ్యి కార్యతో ర్యాలీ అని అతి చేస్తూ ప్రకటించనేల.. ఇప్పుడు అన్ని కార్లకు గతిలేక.. చేరికను వాయిదా వేసుకుంటూ ఈ పాట్లు పడనేల అని పలువురు నవ్వుకుంటున్నారు.